ట్రంప్​పై భారత్​ భారీ అంచనాలు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్​ ఎన్నికవడం భారతదేశంలో  గొప్ప అంచనాలను సృష్టించింది.  ట్రంప్ గెలిచిన తర్వాత మోదీకి చేసిన మొదటి ఫోన్ కాల్‌‌‌‌‌‌‌‌లో ‘ ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోంది’ అని  అన్నారు.  ట్రంప్  ప్రకటన  ప్రపంచవ్యాప్తంగా మీడియా  తుపానును  సృష్టించింది.  డొనాల్డ్‌‌‌‌‌‌‌‌ ట్రంప్‌‌‌‌‌‌‌‌కు  భారత్‌‌‌‌‌‌‌‌ పట్ల  ప్రత్యేక స్థానం ఉందన్నది సుస్పష్టం.  కానీ,  ‘గొప్ప అంచనాల’  పట్ల  జాగ్రత్తగా ఉండాలి.

సాధారణంగా, మనం ఎక్కువగా ఆశించినప్పుడు నిరాశచెందుతాం. అందువల్ల, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నుంచి భారతదేశం కనిష్ట స్థాయిలోనే  ఆశించాలి. ఒకవేళ భారత్​ ఆశించిన స్థాయిని  ట్రంప్  మించిపోతే  మనం సంతోషించాలి.   ఒక్క విషయం మాత్రం స్పష్టంగా  చెప్పవచ్చు.  డెమొక్రాటిక్ అధ్యక్షులు  బిల్ క్లింటన్,  బరాక్ ఒబామా,  జో బైడెన్,   వైస్​ ప్రెసిడెంట్​ కమలా హారిస్‌‌‌‌‌‌‌‌ కంటే ఖచ్చితంగా  ట్రంప్ భారతదేశం పట్ల సానుకూలంగా ఉంటారు. 

గత నెలలో భారతదేశాన్ని ఒక చిన్న దేశం కెనడా వేధించిందని గుర్తుంచుకోవాల్సిన  సందర్భమిది.  ప్రతిరోజూ  యూఎస్​ అధికార -ప్రతినిధులు కెనడా పట్ల సానుభూతితో కూడిన వ్యాఖ్యలు చేస్తారు. అయితే,  ఇప్పుడు  ట్రంప్  అధ్యక్షుడిగా గెలుపొంద
డంతో  డెమోక్రటిక్ అధ్యక్షుల ఆట ఆగిపోతుంది. కమలా హారిస్ అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లయితే, భారతీయులు ఆమెను భారతదేశపు కుమార్తె అని చెప్పుకునేవారు. ఆమె రికార్డును పరిశీలిస్తే.. కమలా హారిస్ 40 ఏండ్లుగా  భారత్‌‌‌‌‌‌‌‌లో  పర్యటించలేదు. 2019లో  కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఆర్టికల్ 370ని తొలగించినందుకు భారతదేశంపై 100 మంది సెనేటర్‌‌‌‌‌‌‌‌లలో  కమలా హారిస్​ మాత్రమే విమర్శల దాడి చేశారు.  కమల  ఎన్నడూ భారతీయ ప్రయోజనాల పట్ల సానుకూలత చూపలేదు. అదేవిధంగా డెమోక్రటిక్ పార్టీ నుంచి వెలువడిన విమర్శలను ఆమె అడ్డుకోలేదు. ఆమె రికార్డు ప్రకారం  కమలా హారిస్ గెలుపు భారతదేశానికి శ్రేయస్కరం కాదు.  డోనాల్డ్ ట్రంప్ బలమైన ఇష్టాలు, అయిష్టాలు కలిగిన వ్యక్తి. ట్రంప్​ ఎవరూ ఊహించలేనివిధంగా, ఆలోచించకుండా సులభంగా మాట్లాడతాడు.  నరేంద్ర మోదీ,  భారత దౌత్యవేత్తలు ట్రంప్ మనోభావాలను నావిగేట్ చేయడం నేర్చుకోవాలి.

ట్రంప్ నుంచి కనీస అంచనాలు

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్  భారత్‌‌‌‌‌‌‌‌కు భారీ స్థాయిలో సహాయం చేయాల్సిన అవసరం లేదు. కానీ,  ట్రంప్  చైనాపై తన కఠినాత్మక చర్యలను కొనసాగించి, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను విస్మరించినా సరిపోతుంది. చైనా ఆర్థిక బలాన్ని తగ్గించేందుకు  ట్రంప్ తన మొదటి పాలనాకాలంలోనే  ఆ దేశంపై  తీవ్ర చర్యలు తీసుకున్నారు.  ట్రంప్‌‌‌‌‌‌‌‌ చర్యలతో చైనాలో ఆర్థిక మాంద్యం మొదలైంది.  ఇది చైనాను బలహీనపరిచింది.  చైనా దూకుడును ప్రభావితం చేసింది.

అమెరికా కంపెనీలు చైనాను విడిచిపెట్టి భారతదేశంలో అనేక ఫ్యాక్టరీలను స్థాపించాయి. యాపిల్ కంపెనీ భారతదేశంలో 3 ఫ్యాక్టరీలను స్థాపించి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. చైనాను సైనికంగా ఎదుర్కొనే చర్యలు కూడా ట్రంప్​ తీసుకున్నారు.  చైనాకు వ్యతిరేకంగా భారత్, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా తదితర దేశాలతో ట్రంప్ ఒప్పందాలు చేసుకున్నారు. వాస్తవానికి,  చైనా  భారత్‌‌‌‌‌‌‌‌తో  సరిహద్దు ఒప్పందాలకు అంగీకరించింది, పాక్షికంగా అది అమెరికా నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటుంది. 1972 తర్వాత  చైనాతో తలపడిన మొదటి యూఎస్​  అధ్యక్షుడు  ట్రంప్. 

కెనడా, ఖలిస్తానీల పోకడ కొంత మారొచ్చు

ట్రంప్​  అప్పట్లో  పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను కూడా పక్కన పెట్టారు.  పాకిస్థాన్ అమెరికా నుంచి బిలియన్ డాలర్లు తీసుకుని ఒసామా బిన్ లాడెన్‌‌‌‌‌‌‌‌ను దాచిపెట్టిందని ట్రంప్ అన్నారు.  పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌కు సైనిక సాయాన్ని నిలిపివేసిన ట్రంప్, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పాక్​ను హెచ్చరించారు.  యూరోపియన్ దేశాలు చైనాను ఎదుర్కోవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం చైనా.. యూరప్​ దేశాలతో పాటు అమెరికా నుంచి శత్రుత్వాన్ని ఎదుర్కొంటోంది.  

భారత్‌‌‌‌‌‌‌‌పై  దాడి చేసే విధంగా బంగ్లాదేశ్, నేపాల్ లేదా ఇతర దేశాల ప్లే గేమ్స్​ను  ప్రోత్సహించేందుకు ట్రంప్  అంగీకరించరు.  జో బైడెన్,  కమలా హారిస్​లాగ కాకుండా అమెరికాలో ఉన్న ఖలిస్తానీల నుంచి వచ్చే బెదిరింపులను కూడా ట్రంప్ అణచివేస్తారు. ఖలిస్తాన్ ద్వారా భారత్‌‌‌‌‌‌‌‌ను వేధించే ప్రయత్నాన్ని ఆపాలని కెనడాకు ట్రంప్ సంకేతాలు ఇవ్వనున్నారు.  ఒక భారతీయ ట్రక్ డ్రైవర్  పనున్ సింగ్ యూఎస్​ వెళ్లి ప్రతిరోజూ భారతీయ విమానాలు, ఇండియన్​ నాయకులకు బెది రింపులు జారీ చేస్తాడు. అదేవిధంగా భారతదేశాన్ని విమర్శల దాడి చేసినా బైడెన్​ ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండటంతోపాటు అతడిని ప్రోత్సహిస్తోంది. ట్రంప్ ఈ చర్యలు  సహించరని ఖచ్చితంగా చెప్పవచ్చు.

భారతీయులపై ట్రంప్​ ఉదారత

వీసాలు, ఇమ్మిగ్రేషన్‌‌‌‌‌‌‌‌పై భారతీయులు చాలా ఉదారతను ఆశించవచ్చు.  అమెరికా సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్,  టెక్ కంపెనీలకు  భారతీయుల వీసాలు, ఇమిగ్రేషన్​ పట్ల తాను ఉదారంగా ఉంటానని ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికాతో   వాణిజ్య లోటును తగ్గించుకునేం
దుకు అమెరికా నుంచి మరిన్ని వస్తువులను భారత్ కొనుగోలు చేయాలని ట్రంప్ డిమాండ్ చేయవచ్చు. యూఎస్​ నుంచి  చమురు కొనుగోలు చేయడం ద్వారా దీన్ని సులభంగా చేయవచ్చు.  ట్రంప్ హఠాత్తుగా లేవనెత్తే  చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి. అయితే, ఇలాంటి సమస్యలకు సులువుగా సమాధానం ఇవ్వొచ్చు.   220 ఏండ్ల క్రితం బ్రిటీష్ మాజీ ప్రధాని లార్డ్ పామర్‌‌‌‌‌‌‌‌స్టోన్ చెప్పినట్టు ‘దేశాలకు శాశ్వత మిత్రులు లేదా శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఆ మాట ఈరోజు నిజమైంది. 

భారత పర్యటనపై ట్రంప్​ ఆసక్తి

డొనాల్డ్​ ట్రంప్‌‌‌‌‌‌‌‌  నిరంతరం  ప్రశంసలు, పొగడ్తలు ఆశిస్తుంటారు.  చాలామంది అరబ్ దేశాల అధినేతలు  ట్రంప్‌‌‌‌‌‌‌‌ను విపరీతంగా పొగడటంతో ఆయన వారికి మిత్రుడయ్యాడు. ఈక్రమంలో భారతీయులు సైతం మర్యాద మన్ననల్లో ఇతర వ్యక్తుల కంటే మెరుగ్గా ఉంటారు.  మన  నాయకులు కూడా ఇదే బాటను అనుసరిస్తారు.   ప్రధాని  నరేంద్ర  మోదీ  ట్రంప్  
కుటుంబాన్ని భారతదేశం  సందర్శించవలసిందిగా గతంలో ఆహ్వానించారు.  దీంతో  అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్  2020 ఫిబ్రవరి 24, 25,  తేదీలలో భారత్​లో పర్యటించారు.  ప్రధాని మోదీ  ప్రభుత్వం ఆతిథ్యాన్ని స్వీకరించారు.

భారత్​ ఆతిథ్యాన్ని  ట్రంప్  కుటుంబం ఎన్నటికీ మరచిపోలేదు.  ప్రపంచంలో ఎక్కడా తమను ఇంత ప్రేమగా స్వీకరించలేదని ట్రంప్ కుటుంబం వ్యాఖ్యానించింది.  అప్పటినుంచి భారత్‌‌‌‌‌‌‌‌,  మోదీల పట్ల  ట్రంప్‌‌‌‌‌‌‌‌కు మంచి ఫీలింగ్‌‌‌‌‌‌‌‌ మొదలైంది.  ట్రంప్ భార్య మెలానియా పట్టుబట్టి ట్రంప్​ను  గాంధీ  ఆశ్రమాన్ని  సందర్శించాలని  కోరారు.  ట్రంప్  తరచూ భారత్  పర్యటన గురించి ప్రస్తావిస్తారు. 

భారత్​పైన  చైనా, పాక్​మాటల దాడి తగ్గొచ్చు

అమెరికాలో జరిగిన నరేంద్ర మోదీ సమావేశానికి ట్రంప్ కూడా హాజరవగా,  మోదీ ఆయనను విపరీతంగా ప్రశంసించారు. కేవలం అతిథి సత్కారమే నాయకుల మనసును గెలుస్తుందని వ్యాస రచయితగా నేను చెప్పడంలేదు. అయితే, భారత్‌‌‌‌‌‌‌‌తో అమెరికాకు పెద్ద సమస్యే లేదు. అమెరికాకు చైనా, రష్యా, ఇరాన్ వంటి ఇతర పెద్ద ప్రత్యర్థులు ఉన్నారు. చైనా, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ల మధ్య  ఉన్న మిత్రత్వం భారత్‌‌‌‌‌‌‌‌కు అతిపెద్ద సమస్య.  

ప్రపంచంలోని ప్రతి ఫోరమ్‌‌‌‌‌‌‌‌లోనూ భారత్‌‌‌‌‌‌‌‌ నిరంతరం చైనా, పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌ల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. భారత్​ పట్ల ట్రంప్​ సానుకూల వైఖరి కారణంగా చైనా, పాక్​ల మాటల దాడి ఉధృతం తగ్గవచ్చు.  బిల్​ క్లింటన్,  బరాక్​  ఒబామా  కంటే  ట్రంప్​తో భారత్​ ఆశావహ దృక్పథాన్ని అవలంబించే  అవకాశం
ఎక్కువగా  ఉంది. 

- డా.  పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్​-